తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత కొన్ని రోజులుగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,372 మంది డెంగ్యూ బారిన పడ్డారు. జూన్‌ నెల చివరి వరకు 1,078 మందికి డెంగ్యూ నిర్ధారణ కాగా.. గత రెండు నెలలుగా 4,294 మందికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రైవేటు, గవర్నమెంట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

ప్రభుత్వం ముందుచూపు లేకపోవడం.. వైద్య, ఆరోగ్య శాఖకు ‘మందుల’చూపు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా, ఇతర విష జ్వరాల విజృంభణతో ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలు నిండిపోయాయి. ప్రభుత్వ దవాఖానల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తుండగా నగరంలోని కొన్ని కార్పొరేట్‌ దవాఖానలు ‘మా హాస్పిటల్‌లో బెడ్స్‌ ఖాళీగా లేవు. వేరే హాస్పిటల్‌కు వెళ్లండి’ అని గేటు నుంచే వెనక్కి పంపుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ‘మేం సర్వే చేస్తున్నప్పుడు ప్రతి పది మందిలో కనీసం ముగ్గురు, నలుగురు జ్వరం ఉన్నట్టు చెప్తున్నారు’ అని ఆరోగ్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. అంటే ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు కనిపిస్తున్నారు.

అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీగా కేసులు నమోదైనా డెంగీ మరణాలు లేవని వైద్యఆరోగ్యశాఖ చెబుతోంది. 152 మందికి చికెన్ గున్యా, 191 మందికి మలేరియా సోకినట్టు ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది.

డెంగీకి కారణమయ్యే టైగర్‌ దోమ మంచి నీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. పిల్లల్లో డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్‌ తదితర జ్వరాలు పెరుగుతున్నాయి. ఆఖరి నిమిషంలో వైద్యులను సంప్రదించడంతో కొన్నిసార్లు పరిస్థితి విషమంగా మారుతోంది.

జ్వరం వస్తే పారాసిటమాల్‌ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదని, రెండురోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్యారోగ్యశాఖ సూచిస్తోంది. వర్షం కారణంగా తాగునీరు, ఆహారం కలుషితమవడం వల్ల డయేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బాగా కాచి చల్లార్చిన నీళ్లతోపాటు వేడి వేడిగా ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.