అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ..సీబీఐకీ నోటీసులు

Delhi HC issues notice to CBI on Arvind Kejriwal’s bail plea in excise policy case

న్యూఢిల్లీః ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో సీఎం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.

మద్యం పాలసీ కేసులో మార్చిలో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. అదే నెల 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. మధ్యంతర స్టేను సవాల్‌ చేయగా.. హైకోర్టు తోసిపుచ్చింది. ఇక జూన్ 29న కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

కాగా, మరోవైపు మద్యం కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీని ట్రయల్‌ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 12 వరకూ పొడిగించింది. తీహార్‌ జైలులో ఉన్న ఆయనను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా స్పెషల్‌ జడ్జి కావేరీ బవేజా సమక్షంలో బుధవారం హాజరుపరిచారు. ఆయన జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 12 వరకు పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.