ఏపీలో ఆ ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు..!

Deadline for the transfer of those employees in AP has been extended..!

అమరావతి: ఏపీలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తాజాగా సడలించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 31 వరకూ ప్రభుత్వంలోని 15 శాఖల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎక్సైజ్ శాఖకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకూ బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఉన్న ఉద్యోగుల బదిలీల గడువును వచ్చే నెల 15 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఉద్యోగుల బదిలీల గడువు కూడా ఆగస్టు 31తో ముగియనుంది. దీంతో వీరి బదిలీలపై నిషేధం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీన్ని ఇప్పుడు మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రేపటి తో ఉద్యోగుల బదిలీల గడువు ముగుస్తోది. అయితే ఇంకా కొన్ని కీలక శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం ఇప్పటివరకూ మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు జరగలేదు. వీటిలో కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు లేనట్లేనన్న వాదన వినిపిస్తోంది. అలాగే రవాణా శాఖలో ఆరోపణల నేపథ్యంలో బదిలీల మార్గదర్శకాల విడుదలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఇవి మినహా మిగిలిన శాఖల్లో బదిలీల ప్రక్రియ రేపటితో ముగియనుంది.