హర్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులలో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. అయితే ఈ రెండు జోనర్లను కలుపుకుంటూ తెరకెక్కిన సినిమా పట్ల ఏ స్థాయిలో ఆడియన్స్ ఉత్సాహాన్ని చూపిస్తారనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాంటి ఒక తమిళ సినిమానే ‘బ్లాక్’. ఏడాది క్రితం అక్టోబర్ 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ తరువాత ఓటీటీ లోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ‘డార్క్’ పేరుతో, అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఒక ఆంగ్ల సినిమా ఆధారంగా ‘డార్క్’ సినిమాను రూపొందించారు. సరదాగా గడపడం కోసం, తమ కొత్త విల్లాకు వెళ్లిన భార్యాభర్తలకు ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయనే కథతో ఈ సినిమా కొనసాగుతుంది. ఆ జంట తమ సమస్యను గుర్తించేవరకూ ఫస్ట్ పార్టుగా .. సమస్యను అర్థం చేసుకుని అక్కడి నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నం సెకండాఫ్ గా ప్రేక్షకులను పలకరిస్తుంది.

స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. క్లిష్టమైన పాయింట్ ను అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడి పనితీరు మెప్పిస్తుంది. ఆ పాత్రలను పోషించిన జీవా – ప్రియా భవాని శంకర్ నటన ప్రేక్షకులను రియాలిటీకి దగ్గరగా తీసుకుని వెళుతుంది. పౌర్ణమి రాత్రులతో ముడిపెట్టి దర్శకుడు కథను వెన్నెల్లో నడిపించిన విధానం హైలైట్. సినిమా మొత్తం మీద ఒక డజను పాత్రలు కనిపించినప్పటికీ, కథలో 90 శాతం కేవలం రెండు ప్రధానమైన పాత్రల చుట్టూనే తిరుగుతుంది. సాధారణంగా హారర్ థ్రిల్లర్ కి సంబంధించిన కథలు ఒక విల్లాలో జరుగుతూ ఉంటాయి. ఈ కథ కూడా విల్లా చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ కథ వేరు .. దీని తీరు వేరు. ఇక్కడ కథ సైన్స్ ఫిక్షన్ తో ముడిపడి కనిపిస్తుంది. కథలోని కొత్తదనమే చివరి వరకూ ప్రేక్షకులను కూర్చోబెడుతుంది.