రామప్ప ఆలయం ప్రమాదంలో ఉందా..?

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో నుంచి గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతోన్న వర్షాలతో రామప్ప ప్రధాన ఆలయంలోని ఈశాన్యం భాగంలో ఉన్న రెండు పిల్లర్లతో పాటు పలు చోట్ల వర్షపు లీక్ అవుతోంది. దీంతో ఆయన ప్రాంగణమంతా వాన నీటీతో బురదమయంగా మారింది.

కాగా, 2018 ప్రాతంలో ఆలయంలో వాటర్ లీక్ అవ్వగా.. కేంద్ర పురావస్తుశాఖ అధికారులు స్పందించి ఆలయ పైకప్పుపై మరమ్మతులు చేయించారు. అనంతరం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం పరిరక్షణకు ఇలాంటి సమస్య ఉండకూడదు అంటూ.. 2020లో ఆలయ పైకప్పుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టారు. డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, ఇటుక పొడి, ఇసుక కలిపి మిశ్రమంగా చేసి లీకేజీలు పూడ్చేశారు. సరిగ్గా మళ్లీ నాలుగేళ్లకు మళ్లీ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో వాటర్ లీక్ అవ్వడం పర్యాటకులను ఆందోళన కలిగిస్తోంది.

ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఆలయం ప్రమాదపుటంచుల్లో కొట్టుమిట్టాడుతోంది అని అరకొర నిధులతో ఆలయం, ఉప ఆలయాల పునరుద్ధరణ పనులు చేపట్టినా.. ఆశించిన స్థాయిలో పనులు కొనసాగడం లేదని ఆలయ అధికారులు , భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆలయం ఫై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.