దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ

చేతిలో లాఠీ ఉంది కదా అని కొంతమంది పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ..సమాజం చేత ఛీ కొట్టించుకుంటారు. మరికొంతమంది పోలీసుల అత్యుత్సాహంతో అమాయకుఫై జులం చూపిస్తారు. తాజాగా అలాంటిదే రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది.

అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత దంపతులను.. బంగారం దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై జులై నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డి.. మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్, అఖిల అనే మొత్తం ఐదు మంది పోలీసులు ఇద్దరు దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

విచారణ జరిపిన పోలీసులు.. భర్తను వదిలేసి.. 13 ఏళ్ల కుమారుడు, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. తనను డీఐ రాంరెడ్డి చిత్రహింసలకు గురిచేసినట్టు బాధితురాలు పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి.. రాత్రి పూట తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ.. చీర విప్పించి చెడ్డి తొడిగించి మరీ తన కన్న కొడుకు ముందే చితకబాదారంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

దొంగతనం ఒప్పుకోకపోవడంతో కొడుకను కూడా అరికాళ్లపై రబ్బర్ బెల్ట్‌తో కొట్టినట్టు బాధితులు వివరించింది. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోతే.. తనను ఇంటికి పంపించారని.. అది కూడా ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఉన్నతాధి కారులను ఆదేశించారు. డీఐ రాంరెడ్డిని సైబరాబాద్ కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్టు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం విచారించి నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.

మహిళ సునీతను ఆదివారం షాద్ నగర్ లోని ఆమె ఇంటికి వెళ్లి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ పరామర్శించారు. పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేశారని, తమకు న్యాయం చేయాలంటూ సునీత తమ గోడును చెప్పుకుని విలపించింది. ఈ సందర్భంగా వెంకటయ్య, ప్రీతమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దాడులను సహించబోదని స్పష్టం చేశారు. మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా మహిళను స్టేషన్ కు రాత్రిపూట తీసుకెళ్లి కొట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతను కొట్టిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.