ఏపీలో 5.02 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. రూ.341 కోట్ల సాయం అవసరం

ఏపీలో భారీ వర్షాలు, వరదలకు 5.02 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు సాయంగా రూ. 341 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమని తేల్చింది. 16జిల్లాల్లో 4.53లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 12జిల్లాల్లో 48,632ఎకరాల్లో ఉద్యాన పంటలు మునిగిపోయాయి. వరి, పత్తి, కంది, పెసర, వేరుశనగతోపాటు మిర్చి, అరటి, పసుపు, కంద, నిమ్మ పంటలకు నష్టం జరిగింది.

NTR జిల్లా పరిధిలో దాదాపు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.532 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.200 కోట్లు, రవాణా రంగానికి రూ.35.50 కోట్లు, పర్యాటక రంగానికి రూ.20 కోట్ల నష్టం జరిగింది. విజయవాడ డివిజన్లో రైల్వే శాఖ రూ.30 కోట్ల ఆదాయం కోల్పోయింది. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.