మాజీ MLA సత్యనారాయణ రాజు కన్నుమూత

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత రుద్రరాజు సత్యనారాయణ రాజు(98) కన్నుమూశారు. జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నేతలకు, కమ్యూనిస్టు పార్టీ నేతలకు ఆర్‌ఎస్‌గా సుపరిచితులైన ఆయన 1928లో యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో రుద్రరాజు గోపాలరాజు, సూరమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఆర్‌ఎస్‌కు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నాలుగో తరగతి వరకూ చించినాడలోనే సాగింది.

అనంతరం నరసాపురం టేలర్‌ హైస్కూల్లో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివారు. 1948 మార్చిలో స్కూల్‌ ఫైనల్‌ ఉత్తీర్ణులయ్యారు. భీమవరంలోని వెస్టుగోదావరి కళాశాలలో (ప్రస్తుత డిఎన్‌ఆర్‌ కళాశాల)లో ఉన్నత విద్య అభ్యసించారు. క్విట్‌ఇండియా ఉద్యమకాలంలో ‘బ్రిటీష్‌వాళ్లు పోవాలి.. దేశానికి స్వాతంత్రం కావాలి’ అంటూ గోడలపై నల్లనిబొగ్గుతో నినాదాలు రాసి స్వాతంత్య్రోదమంతో చిన్నవయస్సులోనే మమేకమయ్యారు. ఆర్‌ఎస్‌ తల్లి చిన్న వయస్సులోనే మృతి చెందగా 20 ఏళ్ల వయస్సులో తండ్రి మరణించారు. ఆర్‌ఎస్‌కు కలగంపూడికి చెందిన సూర్యకాంతంతో 1947 జూన్‌ 6న వివాహమైంది. ఆర్‌ఎస్‌కు ముగ్గురు కుమార్తెలు.

ఈయన 1952 నుంచి 1965 వరకు యలమంచిలి మండలం చించినాడ సర్పంచ్ గా పనిచేశారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన స్వగ్రామం చించినాడలో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.