బండి సంజయ్ కి సీపీ రంగ‌నాథ్ స‌వాల్..

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి వ‌రంగ‌ల్ సీపీ ఏవీ రంగనాథ్ సవాల్ విసిరారు. . ‘న‌న్ను ల‌క్ష్యంగా చేసుకుని బండి సంజ‌య్ అనేక ఆరోప‌ణ‌లు చేశారు. లేని నింద‌లు మోపారు. ఒక్క సెటిల్‌మెంట్, ఒక్క దందా, ఒక్క డీల్ చేసిన‌ట్లు లేదా నాకు లాభం వ‌చ్చేలా ఏదైనా డీల్ చేసిన‌ట్లు నిరూపిస్తే.. అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్టు నిరూపిస్తే ఉద్యోగం వ‌దిలిపెట్టి వెళ్లిపోతాను అన్నారు.

పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారిస్తున్న వరంగల్ సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ పలు ఆరోపణలు చేసారు. విజయవాడ సత్యంబాబు కేసులో సీపీ పాత్ర ఏమిటో తనకు తెలుసని, సీపీ రంగనాథ్ ను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నీ ఆస్తిపాస్తుల జాబితా బయటకు తీస్తా… నల్గొండలో ఏంచేశావో, ఖమ్మంలో ఏంచేశావో అంతా తెలుసు… వీటన్నింటిపై ప్రమాణం చేయగలవా? అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో బండి సంజయ్ ఆరోపణలపై సీపీ స్పందించారు.

న‌ల్ల‌గొండ ఎస్పీగా ప‌ని చేసిన‌ప్పుడు ఏదో చేశాన‌ని, ఖ‌మ్మంలో ఉన్న‌ప్పుడు కూడా ఏదో చేశాన‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎందుకు ఈ ఆరోప‌ణ‌లు చేయ‌లేదు. అరెస్టు కాగానే ఈ ఆరోప‌ణ‌లు చేశారు. న‌ల్ల‌గొండ‌లో నేను ప‌ని చేసిన‌ప్పుడు కూడా అన్ని పార్టీల నేత‌లు అరెస్టు అయ్యారు. వ‌రంగ‌ల్‌లో కూడా అన్ని పార్టీల నేత‌లు అరెస్టు అయ్యారు. అప్పుడు చేయ‌ని ఆరోప‌ణ‌లు ఇప్పుడెందుకు చేస్తున్నారు అని బండి సంజ‌య్‌ను రంగ‌నాథ్ ప్ర‌శ్నించారు.

సంజయ్ ఆరోపణలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడంలేదని అన్నారు. తాను సెటిల్ మెంట్ చేసినట్టు నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తానని స్పష్టం చేశారు. సత్యంబాబు కేసుపై బండి సంజయ్ కి పూర్తిగా అవగాహన లేదని, సత్యంబాబు కేసును తాను హ్యాండిల్ చేయలేదని సీపీ రంగనాథ్ వెల్లడించారు. కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్లు దర్యాప్తును తప్పుబట్టడం సాధారణం అని వ్యాఖ్యానించారు. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హిందీ పేపర్ లీక్ దర్యాప్తును రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు.