టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కోర్ట్’. ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న రిలీజైన ‘కోర్ట్’ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి వారంలో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా, రెండో వారంలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.సాధారణంగా చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు అంతగా హైప్ ఉండదు. కానీ ‘కోర్టు’ చిత్రం అనూహ్యంగా పెద్ద హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటివారంలోనే రికార్డు వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
బాక్సాఫీస్ రికార్డులు
విడుదలైన మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.కేవలం పది రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరింది .సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “గొప్ప సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకుల హిస్టారికల్ తీర్పు” అంటూ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.కేవలం రూ. 9 నుంచి రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా భారీ లాభాలను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
కోర్ట్ బ్యాక్‌డ్రాప్
2013 నేపథ్యంలో సాగే కథ ఇది. చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అవుతాడు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఓ ఇంటి దగ్గర వాచ్ మెన్ గా పనిచేసే చందుకీ పెద్దింటి అమ్మాయి, ఇంటర్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)కీ మధ్య ప్రేమ పుడుతుంది. ఆ విషయం కాస్త జాబిలి ఇంట్లో తెలుస్తుంది. ఎప్పుడూ కుటుంబం పరువు, స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మంగపతి (శివాజీ) కోపంతో రగిలిపోతాడు. ఏం జరిగిందని వెనకా ముందు ఆలోచించకుండా పోక్సో చట్టంతోపాటు, ఇతర కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు పెట్టిస్తాడు. ఆ పరిణామం ఏ తప్పూ చేయని చందు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? పేరు మోసిన న్యాయవాది మోహన్ రావు (సాయికుమార్) దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ తేజ (ప్రియదర్శి) ఈ కేస్‌ని ఎలా భుజాన వేసుకున్నాడు, ఆ న్యాయ పోరాటం ఫలించిందాలేదా అనేది తెరపైన చూడాలి.

రూ.50 కోట్ల క్లబ్‌లో ‘కోర్ట్’
ఈ సినిమా విడుదలై 10 రోజులైనా ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వస్తుండటం వల్ల మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.50.80 కోట్లు వసూల్ చేసినట్లు టాక్. పదో రోజైన ఆదివారం కూడా రూ.4కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా లాంగ్‌రన్‌లో మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో విడుదలైన చిన్న సినిమాల్లో అత్యంత లాభాలను తీసుకొచ్చిన మూవీగా కోర్ట్ నిలిచినట్లు సమాచారం. అటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
పెర్ఫార్మెన్స్
శ్రీదేవి – రోషన్ జంటగా ఆకట్టుకోగా, ఇద్దరూ నిజజీవిత పాత్రలు పోషించినట్టు నటించారు.
శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు జీవం పోశారు.ముఖ్యంగా సాయికుమార్, శివాజీ పోషించిన క్యారెక్టర్లు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాయి.