13 అసెంబ్లీ స్థానాల్లో కౌంటింగ్‌..11 చోట్ల ఇండియా కూటమి ఆధిక్యం

Counting in 13 assembly seats.. India alliance leading in 11 places

న్యూడిల్లీః ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకూ 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మరో రెండు చోట్ల ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 10న పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మూడు (ఉత్తరాఖండ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌) రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండగా.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల సంఘం (EC) వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 13 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 4 స్థానాల్లో, బీజేపీ, డీఎంకే, ఆప్, జేడీయూ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని డెహ్రా, నలాగఢ్, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, మధ్యప్రదేశ్‌లోని అవార్వారా స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌, రాణాఘాట్‌ దక్షిణ్‌, బాగాధ్‌, మనిక్‌టాలా స్థానాల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ స్థానంలో ఆప్ ఆధిక్యంలో ఉంది. బీహార్‌లోని రూపాలీ స్థానంలో జేడీయూ, హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. తమిళనాడులోని విక్రవాండి స్థానంలో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది.