ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి

Continued flood elevation of Prakasam barrage

పల్నాడు: ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బ్యారేజీకి 2,89,718 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. మొత్తం 70 గేట్లు ఎత్తి 2,75,950 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 గేట్లు 7 అడుగులు, 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 13,768 క్యూసెక్కులు వదులుతున్నారు.

మరోవైపు శ్రీశైలం జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌ వే ద్వారా 3.09 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3.98 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులుగా నమోదైంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి సాగుతోంది. విద్యుదుత్పత్తి చేసి 65,410 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ నుంచి 2.42 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కులను మళ్లిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం 32 టీఎంసీలుగా ఉంది.