నేడు ఖమ్మంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ప్రదర్శన

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్, ఈడీలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. కాగా ఈ వ్యవహారాన్ని సీరియస్​గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ .. విద్యార్ధి, నిరుద్యోగ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… నేటి నుంచి వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు నిర్వహించబోతుంది. అందులో భాగంగా ఈరోజు ఖమ్మంలో భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించనుంది. నిరుద్యోగ సభకు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు జాతీయ, రాష్ట్ర సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. TSPSC పేపర్‌ లీకేజీతో పాటు టెన్త్‌ ప్రశ్న పత్రాల లీకేజీ, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం కూడా మాట తప్పిందని ..ఇలా వీటన్నింటిపై పోరాడాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో ఈరోజు ఖమ్మం నగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారీ ప్రదర్శన.. మయూరి సెంటర్, పాత బస్టాండ్ వరకు కొనసాగనుంది.