వయనాడ్‌ మృతులకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సంతాపం

Congress Parliamentary Party condoles the deaths of Wayanad

న్యూఢిల్లీ: కేరళ లోని వయనాడ్‌ జిల్లా లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 150 దాటింది. ఇక ఈ దుర్ఘటనలో గాయపడిన మరో 130 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంట్‌లోని సెంట్రల్‌ హాల్‌లో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వయనాడ్‌ మృతులకు సంతాపం తెలియజేశారు. నేతలంతా లేచి నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అనంతరం ఇవాళ పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ.. వయనాడ్‌ ఘటన హృదయాలను కలిచి వేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలువాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. అదేవిధంగా విద్య విషయంలో ఎన్డీఏ సర్కారు తీరును ఆమె తప్పుపట్టారు.

గడిచిన పదేళ్లుగా ఎన్డీఏ సర్కారు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశంలో విద్యావ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు, అవినీతితో విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరం చేశారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. ఇవాళ రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వయనాడ్‌కు వెళ్తారని, పరిస్థితిని పరిశీలిస్తారని చెప్పారు.