హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మల్లన్న తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం అసహ్యకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను గౌరవించకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు సహించరానిదని స్పష్టం చేశారు.
నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నను గెలిపించేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేశామని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ సహాయంతోనే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని, ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం తగదని అన్నారు. పార్టీ ఇచ్చిన పదవిని వదిలేసి బయట నుండి విమర్శలు చేయాలని సూచించారు.

తీన్మార్ మల్లన్న ప్రత్యేకంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం బాధాకరమని, కాంగ్రెస్ అనుసరించే సమానత్వ, సామాజిక న్యాయం సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలతో మల్లన్న ప్రజల్లో అనవసరమైన వివాదాలకు తావిస్తోందని, ఇది పార్టీకే నష్టం కలిగించే చర్యగా మారుతుందని హెచ్చరించారు.
పార్టీ నాయకత్వం మల్లన్నపై తగిన చర్యలు తీసుకుంటుందని అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. క్రమశిక్షణా సంఘం ద్వారా ఆయనపై విచారణ చేపట్టాలని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఏకతాటిపై ఉండాలని, వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ విధానాలను దెబ్బతీసేలా ఉండకూడదని సూచించారు.
ఇదే కొనసాగితే, తీన్మార్ మల్లన్నకు పార్టీ నుంచి శిక్షా చర్యలు తప్పవని అంటున్నారు. మల్లన్న తన విధానాన్ని మార్చుకుంటారో, లేక మరింత గట్టి దూకుడు ప్రదర్శిస్తారో అనేది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.