భారత్‌లో మంకీపాక్స్‌ నిర్ధారణ.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Confirmation of monkeypox in India.. The centre alerted the states

న్యూఢిల్లీ : మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా దేశం నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ‘ఎంపాక్స్‌’ ఉందని నిర్ధారణ అయింది. రోగికి పశ్చిమ ఆఫ్రికా క్లేడ్‌-2 రకం వైరస్‌ ఉందని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన ప్రజారోగ్య అత్యయికి స్థితికి కారణమైన క్లేడ్‌ 1 రకానికి చెందిన కేసు కాదని, ఆందోళన అక్కర్లేదని తెలిపింది. భారత్‌లో 2022 జూలై తర్వాత 30 ఎంపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. అలాంటిదే ఈ కేసు కూడా అని కేంద్రం పేర్కొన్నది. ఎంపాక్స్‌ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపింది.

ఎంపాక్స్‌ వైరస్‌కు సంబంధించి.. ప్రస్తుతం మనదేశంలో ప్రజలకు ఎలాంటి ముప్పూ లేదని, వైరస్‌ వ్యాప్తిపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని వెల్లడించింది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎంపాక్స్‌ రెండో వేవ్‌ మొదలవ్వటంతో, ప్రజా ఆరోగ్యంపై గత నెలలో డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మరోవైపు, మంకీపాక్స్‌పై రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఎంపాక్స్‌ అనుమానిత కేసుల స్క్రీనింగ్‌, టెస్టింగ్‌లను నిర్వహించాలని, అలాగే వ్యాధి నిర్ధారిత, అనుమానిత రోగులకు అవసరమయ్యే ఐసొలేషన్‌ సౌకర్యాలు కల్పించాలని అడ్వైజరీ జారీ చేసింది. ప్రజల్లో ఎలాంటి భయాందోళనలకు తావివ్వకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరింది.