తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ హిందీని బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తమిళం లేదా ఇతర దక్షిణాది భాషలను బోధించడానికి కేంద్రం ఎందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
భాషా సమస్యల పరిష్కారంలో సాంకేతికత కీలకం
గూగుల్ ట్రాన్స్‌లేట్, చాట్‌జిపిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం భాషా సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడతాయని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు అవసరమైన సాంకేతిక విద్యను నేర్చుకోవడం మేలని, భాషలను బలవంతంగా నేర్పించడం విద్యార్థులపై అదనపు భారం అని ఆయన అన్నారు. గాంధీజీ దక్షిణాది ప్రజలు హిందీ నేర్చుకోవాలని, ఉత్తరాది ప్రజలు దక్షిణాది భాషలను నేర్చుకోవాలని విశ్వసించారని స్టాలిన్ గుర్తు చేశారు. ఈ లక్ష్యంతోనే దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఏర్పాటైందని వివరించారు.

“ఉత్తర భారతంలో తమిళ ప్రచార సభ” ఎందుకు లేదు?
హిందీ ప్రచారం కోసం దక్షిణాది రాష్ట్రాల్లో 6,000 కేంద్రాలతో హిందీ ప్రచార సభ పనిచేస్తోందని స్టాలిన్ తెలిపారు. అయితే, ఉత్తరాదిలో తమిళం లేదా ఇతర దక్షిణాది భాషలను ప్రోత్సహించేందుకు “ఉత్తర భారత తమిళ ప్రచార సభ” లేదా “ద్రవిడ భాషా సభ” లాంటి సంస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
బీజేపీపై విమర్శలు
“గంగా ఒడ్డున సాధు కవి తిరువళ్ళువర్ విగ్రహాన్ని ప్రతిష్టించిన వారే, తర్వాత దానిని నిర్లక్ష్యం చేశారు” అని ఆరోపించారు. తమిళ భాషను ప్రోత్సహించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
“గాడ్సే మార్గాన్ని అనుసరించే వారు గాంధీ లక్ష్యాలను నెరవేర్చలేరు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రైళ్లకు హిందీ-సంస్కృత నామకరణంపై వ్యతిరేకత
తమిళనాడులో నడిచే రైళ్లకు హిందీ-సంస్కృత పేర్లు పెట్టడం ద్వారా తమిళాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. తమిళ భాషను అణగదొక్కే ప్రయత్నాలను ద్రవిడ ఉద్యమమే అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. 1918లో గాంధీజీ దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్థాపించారు.
1964లో ఈ సంస్థను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించారు. మొదటి హిందీ ప్రచారక్ గాంధీజీ కుమారుడు దేవదాస్ గాంధీ. భాషల సమగ్ర అభివృద్ధి కోసం సమతుల్యత అవసరం అని అన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని భాషల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్టాలిన్ సూచించారు. భాషా విధానాల్లో సమతుల్యత పాటించకపోతే జాతీయ ఐక్యత దెబ్బతినే అవకాశం ఉందని స్టాలిన్ హెచ్చరించారు.