కేటీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. “హ్యాపీ బర్త్ డే కేటీఆర్” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ట్వీట్ వేయలేదు. తెలంగాణ సీఎంఓ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్ పడింది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారని, నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేటీఆర్ కి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ ఆకాంక్షించారనేది ఆ ట్వీట్ సారాంశం.

సీఎం రేవంత్ ట్వీట్ కు కేటీఆర్ రీప్లే ఇచ్చారు. సహజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే ఎవరైనా థ్యాంక్స్ అని చెబుతారు, కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పి సరిపెట్టలేదు.. “మెనీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డిగారు..” అంటూనే “అప్రిసియేట్ ద గ్రీటింగ్స్” అంటూ ట్విస్ట్ ఇచ్చారు. తనకు శుభాకాంక్షలు చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.