మరికాసేపట్లో మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

మరికాసేపట్లో మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న(సోమవారం) ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అలాగే నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

ముందుగా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జి, నెల్లికుదురు మండలం రావిరాలలో పర్యటించాల్సి ఉండగా సీఎం షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తాండా చేరుకోనున్నారు. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో సుమారు 100మంది పోలీసులు కాపాడారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆ తర్వాత తిరుమలాపాలెం బ్రిడ్జి, రావిరాల గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. పురుషోత్తమాయగూడెం శివారులోని ఆకేరువాగులో కొట్టుకుపోయిన సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, మోతిలాల్ కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించనున్నారు.