నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy reached Hyderabad
CM Revanth Reddy will go to Delhi today

హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ వారి పర్యటన మీదే నిలిచింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ కోసమే ఆ లిస్టుతో ఢిల్లీకి వెళ్లాడని టాక్ వినిపిస్తుంది. దీంతో ఆశవహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ అదే మంత్రివర్గం కొనసాగుతోంది. ఎనిమిది నెలలుగా అదే కేబినెట్ ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు మంత్రుల సంఖ్యను ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనాల్సి రావడం, శాసన మండలిలో ఖాళీల భర్తీ, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకోవడం, వారికీ మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాల మీద మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది.

ఇప్పుడు దీనిపై చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. మొత్తంగా ఆరుమందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, మల్​రెడ్డి రంగారెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమసాగర్‌ రావు, ఎమ్మెల్సీ అమీర్‌ అలీ ఖాన్‌, బాలునాయక్‌, రామ్మోహన్‌ రెడ్డి, రామచందర్‌ నాయక్‌, మదన్ మోహన్‌ రావులకు బెర్త్ కన్‌ఫర్మ్ అవుతుందని అంటున్నారు.

మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు సైతం వినిపిస్తోన్నప్పటికీ.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపైనా రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.దీంతోపాటు ఢిల్లీ పర్యటనలో పీసీసీ పదవి పై కూడా చర్చ జరగనుందని తెలుస్తుంతి. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డియే ఉన్నారు. అయితే ఈ సారి పీసీసీ పదవి రేసులో మధుయాష్కి, బలరాం నాయక్, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అయితే పీసీసీ పదవి ఫిల్ చేయడం అనివవార్యమైంది. తనకు అనుకూలమైన వారికే పీసీసీ పదవి కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు రేవంత్ రెడ్డి.