రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్ ఏరియాలోని డిఫెన్స్ భూముల కేటాయింపు, వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటుతో పాటు మరిన్ని అభివృద్ధి అంశాలపై కేంద్రమంత్రికి రేవంత్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దాదాపు 25 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య ఇతర నేతలు పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెహిదీపట్నం రైతుబజార్ దగ్గర స్కైవాక్ నిర్మిస్తున్న విషయాన్ని రాజ్ నాథ్ కు వివరించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది. సోమ, మంగళవారాల్లో ఆయన దిల్లీలోనే ఉండనున్నారు.

ఈ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడంతో పాటు పార్టీకి సంబంధించిన పలు విషయాల్లో హైకమాండ్‌తోనూ సమావేశం కానున్నారు. రైతులకు రూ.2 లక్షల వరకూ పంటరుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన రూ.31 వేల కోట్లను రుణాలుగా సేకరించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో లేదా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.