బొగ్గు బ్లాకులు సింగ‌రేణికే కేటాయించాలి..ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెండు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క పార్టీ పెద్దలను కలిసి పార్టీకి సంబదించిన విషయాలు చర్చిస్తూనే..మరోపక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులు , బకాయిల గురించి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. సాయంత్రం ప్రధాని మోడీ తో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ప్ర‌భుత్వ రంగంలో ఉన్న సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్‌)లో తెలంగాణ ప్ర‌భుత్వానికి 51శాతం, కేంద్ర ప్ర‌భుత్వానికి 41శాతం వాటాలున్న‌ట్లు ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. గనులు, ఖ‌నిజాభివృద్ధి నియంత్ర‌ణ చ‌ట్టంలోని (ఎంఎండీఆర్‌) సెక్ష‌న్ 11ఏ/17 (ఏ) (2) ప్ర‌కారం వేలం జాబితా నుంచి శ్రావ‌ణ‌ప‌ల్లి గ‌నిని తొల‌గించాల‌ని, అదే సెక్ష‌న్ ప్ర‌కారం గోదావ‌రి లోయ‌ బొగ్గు నిల్వ‌ల క్షేత్రం ప‌రిధిలోని కోయ‌గూడెం, స‌త్తుప‌ల్లి బ్లాక్ 3 గ‌నుల‌నూ సింగ‌రేణికే కేటాయించాల‌ని ప్రధానిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

2010 సంవ‌త్సరంలో నాటి యూపీఏ ప్ర‌భుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు స‌మాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్‌) మంజూరు చేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐటీ రంగంలో నూత‌న కంపెనీలు, డెవ‌ల‌ప‌ర్ల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింద‌న్నారు. 2014 త‌ర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగ‌లేద‌ని, హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్ పున‌రుద్ధ‌రించాల‌ని పీఎంను సీఎం కోరారు.