టెన్ జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను కలిసిన రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం సోనియాగాంధీ అధికారిక నివాసం 10 జెన్‌పథ్‌లో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిశారు. చాలాకాలం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అగ్రనేత అపాయింట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి రాహుల్ కు రేవంత్ వివరించినట్టు సమాచారం.

సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
త్వరలో సూర్యాపేట, మెదక్ లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ఏదో ఒక సభకు హాజరుకావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి శనివారం ఉదయం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో కలిసి 10 జెన్‌పథ్ కు వెళ్లారు. రాహుల్ తో సమావేశం సందర్బంగా కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం నియామకం, నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు అంశాల గురించి చర్చించనట్టుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై చర్చ
మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అమలు పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ లో గద్వాల్ లేదా మెదక్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.