ప్రధానికి సీఎం రేవంత్ లేఖ

ప్రధాని మోడీ కి తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాసారు. తెలంగాణలో కురిసిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, రోడ్లపై నీరు నిలిచిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కమిషనర్లను సీఎం ఆదేశించారు.

అదే విధంగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్తు సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలని చెప్పారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని సీఎం హెచ్చరించారు. రెవిన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలు ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.