రూపాయి తీసుకొని 43పైసలే ఇస్తున్నారు – సీఎం రేవంత్

బడ్జెట్లో తెలంగాణపై NDA సర్కార్ వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్ను రూపంలో రూపాయి వెళ్తుంటే 43పైసలు మాత్రమే కేంద్రం నుంచి తిరిగి వస్తోందన్నారు. మంగళవారం లోక్ సభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ కు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఫై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రధాన మంత్రి మోదీని కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులపై వివరించామన్నారు. తమ రాష్ట్రంపట్ల పెద్దన్న పాత్ర పోషించమని కోరినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అనవసరమైన బేషజలకు తాముపోలేదన్నారు.

బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని నిషేధించారని.. తెలంగాణ పదాన్ని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందని.. కక్ష సాధిస్తోందని గత ప్రభుత్వాలు చెప్తే అర్థం కాలేదని.. ఇప్పుడు అసలు విషయం పూర్తిగా బయటపడిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీహార్, ఆంధ్రకి తప్ప ఎవరిని పట్టించుకోలేదన్నారు. ఇది కుర్చీ కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉందన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణనికి వేల కోట్లు ఇస్తామంటున్న కేంద్రప్రభుత్వం.. తమ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించింది. కేంద్రంతో ఫ్రెండ్లి‎గా ఉండటం తమ చేతగాని తనం కాదన్నారు. వివక్ష లేకుండా తమ రాష్ట్రానికి రావల్సిన నిధులు కేటాయించాలన్నారు.