వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం

CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల్లో వరద ప్రభావం, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, వరద ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉదయం సమావేశం నిర్వహించనున్నారు. వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాల్లో వర్షపాతం నమోదు అయ్యింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పలు నదులు, వాగులు వల్ల ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 10మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. భారీ వర్షాల వల్ల పంటలు నీట మునగడంతో వాటిపైనా వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి టోల్ ఫ్రీ నంబర్ 040 – 23454088 ఏర్పాటు చేయించారు. వర్షాల వల్ల సమస్యలు తలెత్తితే అత్యవసర సమయంలో సహాయం కోసం ఈ నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు చెప్తున్నారు.