రైతులకు గుడ్ న్యూస్..ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటన

CM Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటోంది. చెప్పినట్లుగానే.. రూ.2 లక్షల వరకూ రైతుల రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. అంతేకాదు.. రుణమాఫీ చెయ్యడానికి ఆరు నెలలుగా మనీ పోగేసిన ప్రభుత్వం.. మొత్తం రూ.31 వేల కోట్లను బ్యాంకులకు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 2023 డిసెంబర్ 9వ తేదీ లోపు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయబోతోంది.

తెలంగాణ సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో మొదటిసారి రూ.16 వేల కోట్లు, 2018లో రెండో సారి రూ.12వేల కోట్లు రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. అయితే.. అప్పటి సర్కార్ 2018 డిసెంబరు 11 కటాఫ్‌ తేదీగా నిర్ణయించిందని తెలిపిన రేవంత్ రెడ్డి.. తన ప్రభుత్వం 2018 డిసెంబరు 12 నుంచి మొదలు పెట్టి.. 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రూ.2లక్షల మేర రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రుణమాఫీతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. తాము నిర్ణయించుకున్న తుది గడువు (ఆగస్టు 15వ తేదీ)లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.