పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా పర్యటన

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా లో బిజీ బిజీ గా పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలని కోరారాయన. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మక హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి నాలుగో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ లో ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయటంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని తెలిపారు. ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో కాగ్నిజెంట్‌, వాల్ఫ్‌, ఆర్సీసీఎం, స్వచ్ఛ్‌ బయో, ట్రైజిన్‌, HCA హెల్త్‌, కార్నింగ్‌, వివింట్, స్క్వాబ్‌ ఉన్నాయి. డల్లాస్‌లో సీఎం బృందంతో జరిపిన చర్చలలో హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ముందుకొచ్చింది. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో చార్లెస్ స్క్వాబ్ పేరొందిన సంస్థ. హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఈ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం.