బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం తో సీఎం రేవంత్ భేటీ..

సీఎం రేవంత్ రెడ్డి..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో భేటీ కావడం సర్వత్రా చర్చ గా మారింది. పోచారం కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారా..? అని అంత మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కీలక నేతలంతా బిఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ , బిజెపి లలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది చేరగా..ఇప్పుడు వీరి వరుస లో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చేరబోతున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.

శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లి సమావేశమయ్యారు. కాంగ్రెస్లో చేరాలని పోచారంను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 13మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోన్న వేళ పోచారంతో రేవంత్ భేటీ ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు పోచారం అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపినా కేసీఆర్ పట్టుబట్టి మరీ ఒప్పించారు. నిజామాబాద్ లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పోచారం జిల్లాలో కాంగ్రెస్ వేవ్ కొనసాగినా సొంత చరిష్మాతో బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాంటి నేత కాంగ్రెస్ లోకి వెళ్తే బిఆర్ఎస్ కు భారీ నష్టం వాటిల్లనుంది.

పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2023 వరకు వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపిక కావడం విశేషం. ఆ క్రమంలోనే పోచారం తెలంగాణ ప్రభుత్వంలో 2014-2019 వరకు వ్యవసాయ మంత్రిగా, 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.