తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు రేవంత్, చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సకల శుభాలు కలగాలని ప్రార్థించారు. ప్రభుత్వం తీసుకున్న రూ.2లక్షల రుణమాఫీ నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణవిముక్తి పొందాలని ఆకాంక్షించారు. అటు కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యతకు వారధిగా మొహర్రం నిలుస్తుందన్నారు. గ్రామాల్లో హిందూ, ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహించడాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.

అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సైతం తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ప్రజలందరికీ ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అటు పవిత్ర మొహర్రం నేపథ్యంలో ముస్లిం సోదరసోదరీమణులకు శుభం జరగాలనే అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన ఇమామ్ హుస్సేన్ జీవితం ఆదర్శమని కొనియాడారు.

ఇక బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పండుగ ఈ జరుపుకుంటారని అన్నారు. త్యాగానికి గుర్తుగా హిందూ ముస్లింలు ఐక్యంగా పీర్లపండుగగా నేడు జరుపుకుంటున్న మొహర్రం.. తెలంగాణ గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడేందుకు మరింతగా కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.