- సాగు కోసం నీటి సరఫరా, ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు
వచ్చే మూడు నెలలు రాష్ట్రంలో తీవ్ర వేసవి ప్రభావం ఉండనుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం, అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బందితో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా నీటి వనరుల నిర్వహణ, సాగు కోసం నీటి సరఫరా, ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చారు.

సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నీటి నిల్వలపై సమీక్ష జరిపిన సీఎం, ప్రణాళిక ప్రకారం సాగుకు తగినంత నీటిని విడుదల చేయాలని సూచించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని, రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు నిరంతర నీటి సరఫరా కొనసాగించాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
వేసవి తాపం పెరిగే కొద్దీ తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశమున్నందున గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని, తగినన్ని నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. అవసరమైన చోట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీ నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని వినియోగించకుండా అడ్డుకోవడానికి టెలిమెట్రీ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. ఏపీ నుంచి నీటి దోపిడీ జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.