ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు.ప్రజా ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు గ్రీవెన్స్ స్థితిని తెలియజేసే సమాచారం అందించాలని, ఇందుకోసం ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారులకు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని వివరంగా తెలియజేయాలని సూచించారు.గ్రీవెన్స్‌ల పరిష్కారంపై మంగళవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ నెంబర్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా తీసుకోవడం ద్వారానే గ్రీవెన్స్ నమోదు చేయాలని, దీని ద్వారా నకిలీ ఫిర్యాదులు అరికట్టవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలి
ప్రభుత్వ యంత్రాంగాన్ని పక్కదారి పట్టించేలా, వ్యవస్థను దుర్వినియోగం చేసేలా ఒకే విషయంపై అదే పనిగా ఎవరైనా ఫిర్యాదు చేస్తూ ఉంటే, అటువంటి వారి వివరాలు సేకరించి, ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వినతులు పరిష్కరించిన తర్వాత ఎవరైతే గ్రీవెన్స్ దరఖాస్తు చేశారో వారి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. తనకు నేరుగా వచ్చే గ్రీవెన్స్‌లను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా ఫిర్యాదుదారులతో సంప్రదించి ఫాలోఅప్ చేయడం ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ కేవలం ఈ మూడు శాఖల నుంచే అత్యధికంగా ఫిర్యాదులు, వినతులు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ప్రభుత్వం రీ సర్వేలో నిబంధనలు ఉల్లంఘించడంతో భూ సంబంధిత ఫిర్యాదులు పెరిగాయి. ఫిర్యాదుల్లో ముఖ్యంగా రెవెన్యూ రికార్డుల్లో భూ యజమాని పేరు మారిపోవడం, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో పేర్ల సవరణ, రీ సర్వేలో విస్తీర్ణంలో తేడాలు వంటివి ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

ఫిర్యాదులు
పోలీస్ శాఖకు సంబంధించి ఆస్తి తగాదాలు, సైబర్ క్రైమ్, వైవాహిక సమస్యలు, భూ సంబంధిత తగాదాలు, ఆర్థిక నేరాలతో ముడిపడిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. మున్సిపల్ శాఖలో కూడా ఫిర్యాదులు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ, నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, అనధికార నిర్మాణాలు, ఆస్తి పన్నులు వంటి వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వివరించారు.
Read Also:Sitaramula Kalyanam : 11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు