విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు – చంద్రబాబు

ఏపీకి సీఎం గా బాధ్యత చేపట్టిన దగ్గరి నుండి చంద్రబాబు..గడిచిన ఐదేళ్ల లో జగన్ సర్కార్ చేసిన ఖర్చులు , లెక్కలు గురించి అరా తీయడం చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి లపై శ్వేతా పత్రాలు విడుదల చేసిన బాబు..మంగళవారం విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఐదేళ్లలో ప్రజలపై 32వేల 166 కోట్ల రూపాయల ఛార్జీల భారం మోపారని పేర్కొన్నారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. పవన విద్యుత్ పై 21 ఒప్పందాలు రద్దు చేసుకున్నారని తెలిపారు.

ట్రూఅప్ ఛార్జీల పేరుతో అదనపు భారం వేశారని, గృహ వినియోగదారులపై 45శాతం ఛార్జీలు పెంచారని చంద్రబాబు వివరించారు. 50 యూనిట్లు వాడిన పేదల ఛార్జీలు కూడా 100శాతం పెంచారని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న సీఎం చంద్రబాబు.. విద్యుత్ శాఖలో ఐదేళ్లలో 79శాతం అప్పు పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంత లోతు ఉందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో ఉండాలని, శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని, వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని సీఎం అన్నారు.