న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తొ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై కేంద్ర ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేసే అవకాశముంది. అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు. శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాడ్ జోషిల అపాయింట్ మెంట్ కోరారు. అవి కూడా ఖరారు అయితే వారితో భేటీ అయి.. అనంతరం విజయవాడకు బయలుదేరి వస్తారు.
అలాగే శుక్రవారం మధ్యాహ్నం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కాగా, చంద్రబాబు, నిర్మలా సీతారామన్‌తో జరుగుతున్న భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి సంబంధించిన 4, 5 అంశాలు నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకురాబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రూ. 11,500 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహకరించడంపై ఆయన ధన్యవాదాలు తెలుపనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో సవరించిన అంచనాలకు సంబంధించి ఇంకా కొంత పెండింగ్‌లో ఉన్నాయని, కొన్ని అంచనాలను అయితే కేంద్రం ఆమోదించిందని.. కేంద్ర జలశక్తి ఆమోదించిన తర్వాత కేంద్రం ఆమోదించాల్సి ఉంది. సుమారు రూ. 45 వేల కోట్ల వరకు సవరించిన అంచనాలను కేంద్రం అంగీకరించాల్సి ఉంది. అయితే విడతల వారీగా కొన్ని నిధులను కేంద్రం విడుదల చేసింది. డయాఫ్రంవాల్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి నిధులు విడుదల చేసింది. అయితే ఇప్పుడే పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడెక్కడ నిధులు పెంగింగ్‌లో ఉన్నది వాటికి సంబంధించిన అంశాలను చంద్రబాబు కేంద్రమంత్రితో ప్రస్తావించనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని నేరుగా గురువారం రాత్రి 12.30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు.