పింఛన్ల పంపిణీ విషయంలో సీఎం చంద్రబాబు ఫుల్ హ్యాపీ

ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. తొలిరోజే 97 శాతం పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. మిగిలిన 3 శాతం పింఛన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగుల ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పింఛన్లు అందించారు.

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు.