న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేసి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టు లాయర్ బి. బాలయ్య దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది విచారణ చేపట్టారు. సీబీఐకి కేసుల బదలాయింపు పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఇది సరైన పిటిషన్ కాదని, దీనిపై ఒక్క మాట ఏమైనా మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది సూచించారు.

బాలయ్య తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సుప్రీంకోర్టు బెంచ్ ఎదుటకు వచ్చారు. ఆయనకు సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఇలాంటి పిటిషన్లను కూడా మీలాంటి సీనియర్లు వాదిస్తారా? ఈవిధమైన కేసులను వాదిస్తారని మేం అస్సలు ఊహించలేదు అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా న్యాయవాది వైపు నుంచి వినకుండానే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.