కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దు: ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

CM Chandrababu appeal to the people

అమరావతిః ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కరించే పని చేయవద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తన కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని… ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని…. నాయకులకు కాదని చంద్రబాబు అన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు.

ఈ విషయంలో ప్రజలకు నేరుగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారించినా కూడా వినకుండా ఎవరైనా తన కాళ్లకు మొక్కితే…..తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. తన సూచనను, విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని సీఎం కోరారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో నడుచుకోవాలని… కాళ్లకు మొక్కే సంస్కృతి మంచి విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఇవాళ్టి నుంచి ఈ విధానానికి స్వప్తి పలుకుదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.