నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి

Chief Minister welcomed the new Governor Jishnu Dev Verma

హైదరాబాద్‌: తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికారు. జిష్ణుదేవ్ వర్మ కాసేపట్లో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

కాగా… ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్, విపక్ష పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

మరో వైపు ..పంజాబ్ గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా బుధవారం ప్రమాణం స్వీకారం చేశారు. చండీగఢ్‌ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కటారియా చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పంజాబ్ కొత్త గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.

గవర్నర్ పదవి ద్వారా పంజాబ్ ప్రజలకు సేవ చేస్తానని కటారియా అన్నారు. తనను నియమించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 45 ఏళ్లపాటు ప్రజాజీవితంలో తాను ఉన్నానన్నారు. ధర్మబద్ధంగా సేవ చేస్తానన్నారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించే దిశగా తాను అడుగులు వేస్తానన్నారు. ఎవరైనాసరే వచ్చి తనతో మాట్లాడవచ్చునన్నారు. అందరితో స్నేహపూర్వకంగా మసులుకుంటానన్నారు.