చెన్నై నగరాన్ని భారీ వర్షాలు , వరదలు వదలడం లేదు. ప్రతి ఏటా ఇలాంటి వర్షాలు , వరదలకు అలవాటుపడిపోయిన జనాలు చిన్న వర్షం పడగానే ముందుగానే పెద్ద జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి, అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాజధాని చెన్నైలోని వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చెన్నైలో ఇప్పటికే 11 సబ్ వేలు మూసివేశారు. అటు సహాయ చర్యలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 16 వేల మంది వాలంటీర్లను సిద్ధం చేసింది. చెన్నైలో 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసింది.
ఎప్పుడు వర్షాలు పడినా చెన్నై నగరం చెరువైపోతోంది. వాతావరణ మార్పులతో ఏటా తుఫాన్ల ప్రభావం పెరుగుతోంది. 1943లో మొదలైన వరదల తాకిడి ఇప్పటివరకు కంటిన్యూ అవుతోంది. చెన్నై వరదలకు ప్రకృతి విపత్తుకంటే మానవ తప్పిదాలే ప్రధాన కారణం. చెన్నైలో మొత్తం 6 అటవీ ప్రాంతాలు ఉన్నాయి. 3 నదులు, 5 తడి నేలలు ఉన్నాయి. అయితే, ఈ ఎకో సిస్టమ్ క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. తడి నేలలు, నదుల విస్తీర్ణం తగ్గిపోయింది.
నగరం భౌగోలిక పరిస్థితులు కూడా వరద ముప్పునకు కారణం అవుతున్నాయి. సముద్ర మట్టానికి చాలా ప్రాంతాలకు కేవలం 2 మీటర్ల ఎత్తులోనే ఉన్నాయి. వరదలు రాగానే ఈ ప్రాంతాలన్నీ నీట మునిగిపోతున్నాయి. ఈ క్రమంలో చెన్నై వరదలు తమిళనాడు వాళ్లకే కాకుండా, హైదరాబాద్ వాళ్లకు డిస్కషన్ పాయింట్ అయ్యింది. హైడ్రా (Hydra)పై కొంత మంది పోస్టులు చేస్తున్నారు. చెన్నైలో మాదిరిగా హైదరాబాద్ వాసులు ఇబ్బంది పడకూడదంటే నాలాలు, మూసీ నది వెంట ఆక్రమణలు తొలగించాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.