తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈసందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఉండే భక్తులకు అడుగడుగునా ప్రసాదాలు పంపిణీ చేస్తుంటారు. ఇక అన్నప్రసాదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే లేటెస్ట్ గా శ్రీవారి అన్నప్రసాదాల మెనూలో టీటీడీ మసాలా వడ చేర్చింది. ఈ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధికారులు.

ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలను తయారు చేసిన టీటీడీ పాలక మండలి.. ట్రయల్ రన్‌లో భాగంగా తాజాగా కొంత మంది భక్తులకు అందజేయడం జరిగింది. ట్రయల్ రన్‌లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు మసాలా వడలు వడ్డించింది టీటీడీ పాలక మండలి. ఇక అటు ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకుమెనూలో మరో పదార్థం చేర్చాలని గతేడాది నవంబరులోనే TTD ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందులో భాగంగా జనవరి 20 మధ్యాహ్నం భోజనం సమయంలో ప్రయోగాత్మకంగా మసాలా వడ వడ్డించారు.
అయితే… ప్రయోగాత్మకంగా 5 వేల వడ చేయించారు. ఇందులో ఉల్లి, వెల్లుల్లి లేకుండా తయారు చేసి భక్తులకు వడ్డించారు. మరో నాలుగు రోజుల్లో వడల తయారీ సంఖ్య పెంచనున్నారు. ట్రయల్ రన్ లో లోటుపాట్లు సరిచేసుకుని రథసప్తమి నాటికి అన్నదాన మెనూలో పూర్తిస్థాయిలో వడలు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మసాలా వడనే కంటిన్యూ చేయాలా లేదంటే ఈ స్థానంలో మరేదేనా వంటకం పెట్టాలా అనే ఆలోచనలోనూ ఉన్నారు టీటీడీ అధికారులు.