అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరి కి చీర కొనుగోలు చేశారు. జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా తన భార్యకు ఆయన గిఫ్ట్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లో పర్యటించిన ఆయన భార్యకు ప్రేమతో చీర కొన్నారు. మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే మహిళా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. పట్టు చీరల ధరలు, వివరాలపై ఆరా తీశారు. అనంతరం తన భార్య భువనేశ్వరి కోసం రూ. 25 వేలు విలువ చేసే పట్టు చీరను కొనుగోలు చేశారు.

మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యం
అంతే కాకుండా మార్కాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను కూడా చంద్రబాబు ప్రారంభించారు. అలానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు చంద్రబాబు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు. దీనిపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలని కోరారు. అంతే కాకుండా మహిళా రైడర్లను కూడా ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో మహిళా డ్రైవర్లను అభినందించారు. ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.