అధికారులతో అర్ధరాత్రి సీఎం టెలీ కాన్ఫరెన్స్

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం తో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలో అనేక గ్రామాల్లోకి వరదనీరు పోటెత్తింది. దీంతో జనం సమీప కొండలపైకి పరుగుతీసి ప్రాణాలు కాపాడుకున్నారు. గురువారం కోస్తాంధ్రలో అక్కడక్కడ, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోతగా వాన పడింది.

ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్య వేక్షించాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరద ఉద్ధృతికి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.