అమరావతి ఫై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు బుధువారం రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే… జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు.

అమరావతి చరిత్ర సృష్టించే నగరం అన్న చంద్రబాబు, శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎటు చూస్తున్న సమాన దూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అని అందుకే రాష్ట్రానికి నడిబొడ్డున ప్రాంతమైనటువంటి అమరావతిని రాజధానిగా నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. కరడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తాడని కానీ జగన్ మాత్రమే అమరావతిని రాజధానిగా అంగీకరించలేకపోయాడని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని.. సంపద సృష్టి జరగాలనేదే తన కోరిక అని చంద్రబాబు స్పష్టం చేశారు.అమరావతి గురించి మాట్లాడిన చంద్రబాబు.. ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అని చెప్పారు. అమరావతి నిర్మాణంలో కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవన్న ముఖ్యమంత్రి.. పాత వాటినే కొనసాగిస్తామని తెలిపారు.

రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు మొత్తం తొమ్మిది నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి పేరుతో జరిగిందని చెప్పిన చంద్రబాబు రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును జగన్ నాశనం చేశాడని నిప్పులు చెరిగారు.