పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. 2019లో సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. పోలవరం ఆపేయాలని ఆదేశించారని చంద్రబాబు ఆరోపించారు. నిరాధార ఆరోపణలపై కాంట్రాక్టర్‌ను మార్చారని.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఏజెన్సీని మార్చకపోతే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేందని చంద్రబాబు అన్నారు.

పోలవరం ఆంధ్రప్రదేశ్‌‌కు జీవనాడి అని, అలాంటి ప్రాజక్టును 5 ఏళ్లపాటు (2019-24) ఎలా విధ్వంసం చేసారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు పోలవరం పనులు ఒక యజ్జంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను, సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని చంద్రబాబు గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్కుల పనులు చేస్తూనే ఎగువ, దిగువ కాఫర్ కాఫర్ డ్యాంల నిర్మాణం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టం కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.3,385 కోట్లు దారి మళ్లించారని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం రూ.4,161 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.4,900 కోట్లు నష్టం జరిగిందనీ.. పోలవరం ఆలస్యంతో రైతులకు రూ.45,000 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వ అసమర్థతతో గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు.