పోలవరం ప్రాజెక్ట్ చూసి ఆవేదన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టును కలియదిరిగారు. అక్కడి పరిస్థితులపై విచారం వ్యక్తం చేశారు. పోలవరంపై పరిస్థితులపై సమీక్షించిన ఆయన.. మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..72శాతం ప్రాజెక్టును తమ హయాంలో పూర్తి చేశామని , పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలను ఎదుర్కొందని, ఉత్తరాంద్ర, ఉభయగోదావరి, కృష్ణ, గోదావరికి ఈ నీరు వాడుకోవచ్చన్నారు. అలాగే తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని జగన్ పై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం పనులను కొనసాగించి ఉంటే.. పోలవరం ప్రాజెక్టు 2020లోనే పూర్తయి ఉండేదన్నారు. తాను ఇప్పటివరకూ పోలవరాన్ని 31 సార్లు సందర్శించానని, తన కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టుబట్టి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించాం కాబట్టే.. పోలవరాన్ని కట్టగలిగామని చెప్పారు. గత ప్రభుత్వం వస్తూ వస్తూనే ఏజెన్సీని మార్చిందని, దాంతో జవాబుదారితనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్యకాలంలో పోలవరం కోసం యావరేజిగా రూ.13,600 కోట్లను ఖర్చు చేశామని.. ఆ కష్టమంతా వృథా అయ్యేలా గత ప్రభుత్వం అలసత్వం వహించిందన్నారు. ఒక వ్యక్తి రాష్ట్రానికే శాపమయ్యాడని, పోలవరాన్ని మరింత సంక్లిష్టంగా మార్చారని దుయ్యబట్టారు. ఏదేమైనా పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.