‘ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్’- చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడ్ని ఎన్నుకున్నారు. అనంతరం అసెంబ్లీ లో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భాంగా చంద్రబాబు మాట్లాడుతూ పవన్ ఫై ప్రసంశలు కురిపించారు.

నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయి..ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్న వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 21కి 21 స్థానాల్లో గెలిచి పవన్ గట్టి సమాధానం ఇచ్చారన్నారు. ‘ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్’ అని కొనియాడారు. ఇక ప్రజాజీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం సభ్యులకు చెప్పారు. అత్యున్నత, గౌరవప్రదమైన సభగా దీన్ని తీర్చిదిద్దాలని సూచించారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ అయ్యన్న వాడి వేడి చూసిన ప్రజలు ఇకపై ఆయన హుందాతనం చూస్తారని పేర్కొన్నారు. అయితే, ప్రత్యర్థులను తిట్టే అవకాశం గౌరవ స్పీకర్ పదవి కారణంగా అయ్యన్న కోల్పోవడం కాస్త బాధగా ఉందంటూ పవన్ అన్నారు. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. సభలో ప్రత్యర్థులను తిట్టే అవకాశం కోల్పోయిన అయ్యన్న పాత్రుడు.. తిట్టే సభ్యులను నియంత్రించాల్సిన బాధ్యత చేపట్టడం సంతోషంగా ఉందని పవన్ న్నారు.

అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సభ హుందాగా నడుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, చర్చల పేరుతో అసభ్య పదజాలం వినిపించకుండా చూడాలని కోరారు. గతంలో సభలో జరిగిన తిట్ల పురాణం వల్ల ప్రజలు విసిగిపోయి, వారిని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారని పరోక్షంగా వైసీపీ ఓటమిని పవన్ గుర్తుచేశారు. విజయాన్ని ఆహ్వానించడం మాత్రమే వారికి తెలుసని, ఓటమిని ఒప్పుకోలేక సభ నుంచి పారిపోయారని విమర్శించారు.