బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఏపీ సీఎం కు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్‌ లో అడుగుపెట్టిన సందర్బంగా ఆయనకు అభిమానులు , పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు..బాబు రాగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ వెల్ కామ్ చెప్పారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లో ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ టీడీపీ కార్యకర్తలు దానిని లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు వర్షంలోనే ఎదురు చూశారు.

తన నివాసానికి ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు టీడీపీ జెండాను చేతబట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. డప్పులు, కళాకారుల విన్యాసాలతో ర్యాలీ కొనసాగింది. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి తో బాబు సమావేశం కానున్నారు. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా, సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటలు జరిగే సమావేశానికి, పది ప్రధాన అంశాలతో ఎజెండా సిద్ధం చేశారు. తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థల పంపిణీతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు.