రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. తాజాగా, ఆయన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని బిల్‌గేట్స్‌కు చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ప్రపంచస్థాయి ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు. దక్షిణ భారత్‌లో గేట్స్ పౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని మంత్రి లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మీ అమూల్యమైన సలహాలు ఏపీలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని బిల్‌గేట్స్‌కి తెలిపారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ని ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏపీలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకో సిస్టంని నిర్వహించేందుకు ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డుల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరఫున నైపుణ్య సహకారం అందిచాలని బిల్ గేట్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ.. చంద్రబాబుని చాలా కాలం తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 1995లో ఐటీ కోసం 2025లో ఏఐ కోసం బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యామని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్‌గేట్స్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.