ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాకుండా, కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌ను సందర్శించి వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి సమావేశం
తణుకు నగరంలోని ఎన్‌టీఆర్ పార్క్ వద్ద సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి కష్టాన్ని గుర్తించారు. పారిశుద్ధ్య కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. కార్మికుల ఆరోగ్య భద్రత, వేతనాలు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. వారి జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను సీఎం ఎదుట ప్రస్తావించారు. ముఖ్యంగా కార్మికులకు మెరుగైన వేతనాలు, ఆరోగ్య బీమా, శాశ్వత ఉద్యోగ భద్రత వంటి అంశాలను వారు ప్రస్తావించారు. వీటికి సీఎం సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ సందర్శన
తదనంతరం తణుకు కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. మార్కెట్‌లో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కూరగాయల వ్యర్థాలను కంపోస్ట్ ఎరువులుగా మార్చి వ్యవసాయానికి ఉపయోగించుకోవడం గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యర్థాల పునర్వినియోగంపై సీఎం దృష్టి తణుకు మార్కెట్‌లో రోజూ పెద్ద మొత్తంలో కూరగాయల వ్యర్థాలు ఏర్పడతాయని, వాటిని సరైన విధంగా వాడుకోవడం వల్ల పర్యావరణ హితంగా మారడంతో పాటు, రైతులకు ఉపయోగపడే ఎరువులుగా మారుస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆధునిక టెక్నాలజీ సాయంతో వ్యర్థాలను సమర్థవంతంగా మళ్లించే ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో భాగంగా తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్, నారాయణ, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తదితరులు సీఎం స్వాగతానికి హాజరయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం పర్యటనను విజయవంతం చేశారు.ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించిన పలు సంక్షేమ పథకాలను వివరించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడం, కూరగాయల వ్యర్థాలను పునర్వినియోగంలోకి తేవడం, పేదలకు నాణ్యమైన వసతులు అందించడానికి చేపట్టిన పథకాలు ముఖ్యాంశాలుగా నిలిచాయి. “ప్రజల సంక్షేమమే మా లక్ష్యం” అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవడానికి ఇలాంటి ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సీఎం పర్యటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను నేరుగా సీఎంకు తెలియజేసే అవకాశం రావడం తమకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తణుకు ప్రజలు కూడా తణుకు అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని హర్షం వ్యక్తం చేశారు.