రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు – చంద్రబాబు

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా సాగారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి దేశం వికసిత భారత్‌గా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన అందులో తెలుగువారే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపితే వైసీపీ వి‌ధ్వంస పాలనతో తిరోమనంలో పడిందని చంద్రబాబు విమర్శించారు.

తెలంగాణ ప్రగతిలో ముందుందన్న చంద్రబాబు ఇబ్బందులను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తోంది. ఏపీలో నా విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. తెలంగాణ టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్​వైభవం వస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నా రెండు కళ్లు. ఎన్టీఆర్‌ అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్‌. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు కానీ కార్యకర్తలు వెళ్లలేదు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా రెండ్రోజుల పాటు తెలంగాణ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం సమావేశం అయ్యారు.